ఫీజుల మోతకు కళ్లెం..!
– వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఫిజుల నియంత్రణ చట్టం
– కసరత్తు చేస్తున్న తెలంగాణ సర్కారు
– ఈనెల 21న సబ్ కమిటి సమావేశం
దర్శిని డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఫీజుల మోతకు సర్కారు కళ్లెం వేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికోసం సర్కార్ కసరత్తును ప్రారంభించింది. గతంలోనే ఫీజుల నియంత్రణ కోసం సబ్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహ సబ్ కమిటీ సభ్యులు విధి విధానాలను సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫీజులకు సంబంధించి ఫిబ్రవరి 21న మంత్రులతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తుంది. ఫీజు నియంత్రణక సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నియమ నిబంధనలపై విద్యాశాఖ అధికారులు సమాచారాన్ని సేకరించి మంత్రుల ముందు సమర్పించనున్నారు. వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రతి విద్యాసంవత్సరంలో ట్యూషన్ ఫీజును 30 శాతం నుంచి 40 శాతం వరకు పెంచుతున్నాయి. అదే విధంగా జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి వివిధ ప్రవేశ పరీక్షల కోసం ఇంటెన్సివ్, స్పెషల్ కోచింగ్ అంటూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు. అధిక ఫీజులు వసూలను నియంత్రించాలని విద్యార్థుల తల్లిడ్రులు ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టవడంపై కూడా సబ్ కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

