స‌ర్కారు బ‌డుల‌కు స‌రికొత్త శ‌కం : మంత్రి ప‌ట్లోళ్ల స‌బితా ఇంద్రారెడ్డి

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

స‌ర్కారు బ‌డుల‌కు స‌రికొత్త శ‌కం..!
– మూడు దశ‌ల్లో మ‌న ఊరు మన బడి, మన బస్తీ మన బడి
– రూ. 7298.54 కోట్ల‌తో 26 వేల పాఠ‌శాల‌ల అభివృద్ధి
– మొద‌టి విడత‌లో 9123 పాఠ‌శాల‌ల ఎంపిక‌
– ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రు భాగ‌స్వాములు కావాలి
– తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప‌ట్లోళ్ల స‌బితా ఇంద్రారెడ్డి
– జిల్లా ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో మంత్రి స‌మీక్ష‌
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలోని స‌ర్కారు బ‌డుల‌కు స‌రికొత్త శ‌కం ప్రారంభ‌మ‌య్యేలా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప‌ట్లోళ్ల స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పోరేట్ స్థాయికి పెంచాల‌నే ప్ర‌ధాన ల‌క్ష్యంతో ప్ర‌వేశ పెడుతున్న మ‌న ఊరు – మ‌న బ‌డి, మ‌న బ‌స్తీ, మ‌న బ‌డి కార్య‌క్ర‌మంపై మంగ‌ళ‌వారం వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి,డాక్టర్ మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్‌ల‌తో క‌లిసి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితారెడ్డి మాట్లాడుతూ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న మ‌న ఊరు – మ‌న బ‌డి, మ‌న బ‌స్తీ – మ‌న బ‌డి కార్య‌క్ర‌మంతో స‌ర్కారు బ‌డుల‌కు స‌రికొత్త శ‌కాన్ని అందించ‌బోతుంద‌న్నారు. మొత్తం మూడు దశల్లో 7298.54 కోట్లతో 22 లక్షల మంది విద్యార్థులు చదివే 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తుంద‌ని తెలిపారు. మొదటి విడతలో 3500 కోట్లతో 60 శాతం మంది విద్యార్థులు చదివే 9123(35శాతం) పాఠశాలల ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌న్నారు. వికారాబాద్ జిల్లాలో 371 పాఠ‌శాల‌ల‌ను ఎంపిక చేసి అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జా ప్ర‌తినిధులు భాగ‌మస్వాము కావాల‌ని, ప్ర‌తి బ‌డి మ‌న‌దే అన్న భావ‌న‌లో అంద‌రిలో క‌లిగేలా కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయాల‌న్నారు. మ‌రోవైపు తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన రాణించేలా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

ప‌క‌డ్బందీగా పాఠ‌శాల‌ల అభివృద్ధి
మ‌న ఊరు – మ‌న బ‌డి, మ‌న బ‌స్తీ – మ‌న బ‌డి కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని మంత్రి స‌బితారెడ్డి తెలిపారు. ఈ ప‌థ‌కం కింద మంజూర‌య్యే నిధుల‌కు రెండు ప్రత్యేక అకౌంట్ లు తెరవ‌డం జ‌ర‌గుతుందన్నారు. 12 అంశాలలో పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంద‌ని తెలిపారు. నిధుల‌ను పారదర్శకంగా ఖ‌ర్చుల‌కు వినియోగిస్తామ‌ని, చేప‌ట్టిన ప‌నుల‌న్నీంటికి సామాజిక తనిఖీ నిర్వహించటం జరుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అతేకాకుండా ప్రతి పనికి ప్రత్యేక సాఫ్ట్ వెర్ ద్వారా ఆన్‌లైన్‌లో వివ‌రాలు న‌మోదు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దీంతో పాటు స్కూల్ కాంపౌండ్ వాల్ లో జూనియర్ కళాశాలలు ఉంటే వాటిని కూడా అభివృద్ధి చేస్తామ‌న్నారు. పాఠ‌శాల అభివృద్ధిలో భాగంగా విద్యా క‌మిటి స‌మావేశాలు, తీర్మానాలు చేప‌ట్టాల‌ని ఆదేశించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. మ‌రోవైపు ఎంపిక చేసిన పాఠశాలలో అన్ని ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

విరాళం ఇస్తే దాత‌ల పేర్లు
ప్ర‌భుత్వ బ‌డుల బ‌లోపేతం, అభివృద్ధికి ఎవ‌రైనా ముందుకు రావ‌చ్చ‌ని అన్నారు. పాఠ‌శాల‌ల అభివృద్ధికి విరాళాలు అందించ‌వ‌చ్చ‌న్నారు. రూ. కోటి విరాళం అందిస్తే పాఠ‌శాల‌కు వారి పేరు పెట్ట‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో జ‌డ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళికృష్ణ, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా విద్యాధికారి రేణుక త‌దిత‌రులు పాల్గొన్నారు.