రోడ్ల రూపు రేఖలు మారుస్తాం..!
– రూ.200 కోట్లతో రహదారుల అభివృద్ధి
– వర్షాకాలంలోగా బ్రిడ్జిల పూర్తికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని అన్ని రోడ్ల రూపు రేఖలు మారుస్తామని, వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జీలను అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు ఎన్టీఆర్ నగర్ రోడ్డుతోపాటు తాండూరు – హైదరాబాద్ మార్గంలోని పెద్దేముల్ మండలం మన సాన్ పల్లి, కందనెల్లిలో నూతనంగా నిర్మిస్తున్న బ్రీడ్జ్ పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనిఖీ చేసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే రోడ్ల సుందరీకరణ పూర్తవుతుందన్నారు. దీంతో పాటు వచ్చే వర్షాకాలంలోగా పెద్దేముల్ మన్ సాన్ సల్లి, కందవెల్లి బ్రిడ్జి పనులను కూడ పూర్తి చేయించేందుకు ప్రత్యేక దృష్టిసారించడం జరుగుతుందన్నారు.
మరోవైపు రూ. 52 కోట్లతో తాండూరు – వికారాబాద్ రోడ్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. తాండూరు ప్రతిష్టాత్మకంగా బైపాస్ పనులు కూడ వర్షాకాలంలోపూ పూర్తవుతాయన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ సబితా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిల సహాకారంతో హైవే రోడ్డును సాధించుకున్నామని అన్నారు. తాండూరులో రోడ్లన్ని పూర్తయితే కాలుష్యం కూడ తొలగిపోయి కాలుష్య రహితంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల్లో ఉన్న హామిలన్నీంటిని దశల వారిగా పూర్తి చేసి తాండూరును అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్లనర్సింలు, శ్రీనివాసాచారి, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్, శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

