నా ప్రమేయం లేకుండానే బడ్జెట్ సమావేశం
– చట్టవిరుద్ధంగానే మళ్లీ సమావేశం ఏర్పాటు
– హక్కుల కోసమే హైకోర్టు ఆశ్రయం
– కార్యాలయం దిగ్బంధంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తన ప్రమేయం లేకుండా మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని రెండోసారి ఏర్పాటు చేశారని, తన హక్కులను కాపాడుకునేందుకు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం బడ్జెట్ సమావేశం నిర్వహణపై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మీడియాతో మాట్లాడారు. రెండో సమావేశం ఏర్పాటును ఆమె ఖండించారు. తనకు తెలియకుండానే గత రెండు రోజులుగా మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ విషయాన్నినేరుగా కాకుండా వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా తెలిపారన్నారు. ఎలాంటి సర్క్యూలర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే గతనెల 25న ఆమోదించిన బడ్జెట్ సమావేశాన్ని మళ్లీ నిర్వహించడంపై హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. దీనిపై కోర్టు పరిశీలించి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన మున్సిపల్ అధికారులకు మళ్లీ సమావేశం నిర్వహించడంలో అంతర్యమెంటనే దానిపై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినట్లు తెలిసిందన్నారు. అయితే కొందరు అధికారులు, నాయకులు కలిసి గతంలో ఆమోదించిన బడ్జెట్ను మళ్లీ ఆమోదించుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. మున్సిపల్లో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాతే రాష్ట్ర బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారని, ఈ విషయం తెలిసి కూడ అధికారులు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. రెండోసారి ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశం చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. మరోవైపు మున్సిపల్లో నిరసనకు దిగిన ప్రతిపక్ష కౌన్సిలర్లు కూడ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారు చేసిన ఆరోపణలకు కోర్టు ద్వారా క్లీన్ చీట్ వస్తుందనే ధీమా ఉందన్నారు. మున్సిపల్లో నాకు చెందాల్సిన హక్కుల గురించే కోర్టును ఆశ్రయించడం జరుగుతుందన్నారు.. ఎప్పుడు తనపై ఆరోపణలు చేయడాన్నే ప్రతిపక్ష కౌన్సిలర్లు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎనాడు వార్డు అభివృద్ధి, సమస్యలపై సంప్రదించలేదన్నారు. ప్రతి వి షయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం బడ్జెట్ సమావేశం వ్యవహారంలో అధికారులను కార్యాలయంలో బంధించిన ప్రతిపక్ష కౌన్సిలర్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అధికారుల జోలికి వచ్చిన కౌన్సిలర్లను వదిలేదిలేదన్నారు. అభివృద్ధికి ఎనాడు అడ్డుపడలేదని, తాండూరు పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బోయరవి, వెంకన్నగౌడ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి ఉన్నారు.

