మహిమాన్వితం జుంటుపల్లి రామస్వామి క్షేత్రం
– అంగరంగా వైభవంగా వచ్చే జాతర ఉత్సవాలు
– టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు
యాలాల, దర్శిని ప్రతినిధి: యాలాల మండలంలోని జుంటుపల్లి రామస్వామి క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందని, వచ్చే జాతర ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు అన్నారు. సోమవారం జుంటుపల్లి శ్రీ సీతా రామ చంద్ర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర తెరాస మాజీ కార్యదర్శి , సీనియర్ నాయకులు కరణం పురుషోత్తమ రావు సందర్శించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ సర్పంచ్ రాఘవేందర్ రావ్ దేశ్ముఖ్‌తో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం దేవాలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. నూతనంగా ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురుషోత్తం రావు మాట్లాడుతూ జుంటుపల్లిలోని శ్రీ సీతారామ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందని అన్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించ లేదన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి దయతో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. రెండు సంవత్సరాల అనంతరం మళ్ళీ తిరిగి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామన్నారు. మరోవైపు ఆలయ ధర్మకర్త కరణం పురుషోత్తం రావును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, సర్పంచ్ వెంకటరెడ్డి, అక్కంపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ, పగిడిపల్లి సర్పంచ్ వరలక్ష్మి వెంకటయ్య, యువ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు.


