యాసంగి ధాన్యాన్ని మొత్తం కొంటాం
– రైతుల ఖాతాలోనే డబ్బులు జమ
– కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం
– తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: యాసంగిలో రైతులు పండించే ధాన్యంను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ రైతులకు తీపి కబురు చెప్పారు. మంగళవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల వ్యవసాయ రంగం ఎంతో పురోగతిని సాధించిందన్నారు. మరోసారి రైతులకు అండగా నిలిచేందుకు దృష్టిసారించడం జరిగిందని, ఇందులో భాగంగా యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.
మరోవైపు కేంద్రంలో పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక ప్రభుత్వం వుందని, ఇది భారత రైతాంగ దురదృష్టమని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఓ బలమైన కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, దాన్ని దృష్టిలో పెట్టుకొనే వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేస్తోందని కేసీఆర్ దుయ్యబట్టారు. 13 నెలల పాటు రైతాంగం ఢిల్లీలో ధర్నాకు దిగాయని అన్నారు. కేంద్రం దిగివచ్చి, ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామని బీజేపీ ఎన్నికల హామీలో పెట్టారని, అయినా దానిని అమలు చేయరని ఎద్దేవా చేశారు. వీటన్నింటితో పాటు ఎరువుల ధరలు కూడా పెంచారని మండిపడ్డారు.

