ఓవర్.. నిర్లక్ష్యం..!
– ట్యాంకు నిండి వృదాగా పారిన నీరు
– అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాగునీటి ట్యాంక్ ఓవర్ పుల్ అయి నీరంతా వృథాగా పారింది. వేసవిలో నీటి వృధా కావడంతో పట్టణ వాసులు అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాండూరు పట్టణానికి మిషన్ భగీరథ ద్వార తాగునీరు అందిస్తున్న విషయం తెలిసిందే. తాండూరు – అంతారం రోడ్డు మార్గంలోని మిషన్ భగీరథ ట్యాంకు నుంచి పట్టణంలోని పాత తాండూరు, మున్సిపల్ కార్యాలయం, కొత్త మున్సిపల్ కార్యాలయంలోని ట్యాంకులకు నీరు అందిస్తారు. ఆయా ట్యాంకుల నుంచి పట్టణంలోని వివిధ కాలనీలకు పైపులైన్ ద్వారా కుళాయిలకు తాగునీరు సరఫరా చేస్తారు. పాత మున్సిపల్‌లోని ట్యాంకును ప్రతిరోజూ రాత్రి సమయంలో నింపి తాగునీరు సరఫరా చేస్తారు. రాత్రి వేళల్లో అక్కడ ఓ కార్మికుడిని కూడ ఉంచుతారు. అయితే మంగళవారం పాత కార్యాలయం వద్ద ఉన్న ట్యాంకుకు మధ్యాహ్నమే తాగునీటి సరఫరా చేసి ట్యాంకును నింపారు. కొద్ది సేపటి తరువాత ట్యాంకు ఓవర్ పుల్ అయ్యింది. దీంతో నీరంతా వృధాగా పారింది. నీటి నియంత్రించేందుకు అధికారులు, సిబ్బంది ఎవ్వరు లేకపోవడంతో భారీ ఎత్తున నీరంతా వృదాగా పారి ట్యాంకు ఆవరణ నుంచి మున్సిఫ్ కోర్టు రోడ్డుమార్గంలో ప్రవహించింది. నీరంతా వృధాగా పారడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికారుల నిర్లక్ష్యం పట్ల పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

