ఐక్యతకు నిదర్శనం ఇఫ్తార్ విందులు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి ఐపీఎస్
– సబ్ డివిజన్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇప్తార్ విందులు అన్ని వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఎస్ అన్నారు. శుక్రవారం తాండూరు సబ్ డివిజన్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో తొలిసారి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఎస్, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సొదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఉపవాస దీక్షలను విరమింప జేశారు.

జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ కఠినమైన ఉపవాస దీక్షలు క్రమశిక్షణను నేర్పుతాయన్నారు. ఇఫ్తార్ విందులు అందరి మద్య ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రంజాన్ ఇప్తార్ విందులో మతసామరస్యత మేళవిస్తుందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజేందర్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, ముక్తార్ నాజ్, ఉర్దూఘర్ చైర్మన్ రజాక్, మైనార్టీ నాయకులు, మత పెద్దలు, సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

