సేమ్ సీన్ రిపీట్..!
– ప్రోటోకాల్‌పై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల వాగ్వివాదం
– తాండూరు చెక్కుల పంపిణీలో నాయకుల రభస
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే వర్గీయుల మద్య వర్గపోరు చల్లారలేదు. తాండూరులో జరిగిన చెక్కుల పంపిణీలో సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. ప్రోటోకాల్‌పై వర్గీయుల మద్య వర్గపోరు రచ్చకెక్కింది. గురువారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ ఏర్పాటు చేశారు.
ప్రజా ప్రతినిధులు మద్య ప్రోటోకాల్ వివాదం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నా వివాదం తప్పించుకోలేదు. కార్యక్రమం ప్రారంభంలో సబావేధికపై తనస్థానాన్ని నిర్దారించలేదని మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ అధికారులను అడిగారు. అక్కడే ఉన్న ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి కూడ అధికారులను ప్రశ్నించడంతో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ జొక్యం చేసుకుని సాయిరెడ్డితో వాదనకు దిగారు.

దీంతో రవీందర్ గౌడ్, సాయిరెడ్డిల మద్య వాగ్వివాదం జరిగింది. ఎంపీపీ కుర్చీలో మీరెలా కూర్చుంటారని సాయిరెడ్డి రవీందర్ గౌడ్‌ను నిలదీయడంతో క్రమంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వారి వర్గీయులను నిలువరించకపోవడం విశేషం. అక్కడే తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, పోలీసులు సభావేధికవద్దకు చేరుకుని వారిని నిలువరించారు. చివరకు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్‌కు కుర్చి వేయడంతో వివాదం సద్దుమణిగింది. ఏదేమైనా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు మరోసారి వర్గపోరుతో రాద్దాంతం చేయడంపై పలువురు పెదవి విరుపు విమర్శలు చేశారు.

