స్వ‌గృహ ప్లాట్ల వేలానికి తేది ఖ‌రారు

తాండూరు వికారాబాద్

స్వ‌గృహ ప్లాట్ల వేలానికి తేది ఖ‌రారు
– వ‌చ్చేనెల 14న నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం
– వేలం నిర్వ‌హ‌ణ‌లో పాత నిబంధ‌న‌లే అమ‌లు
– 8న మ‌రోసారి ఫ్రీబిడ్ స‌మావేశం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గం కోక‌ట్ గ్రామ ప‌రిధిలో ఉన్న రాజీవ్ స్వ‌గృహ‌లో మిగిలిన ఖాళీ ప్లాట్ల‌కు వేలం నిర్వ‌హించే తేదిని అధికారులు ఖ‌రారు చేశారు. వ‌చ్చేనెల 14న వేలం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ హాయాంలో తాండూరులో రాజీవ్ స్వ‌గృహ ప‌థకాన్ని ప్ర‌వేశ పెట్టారు. మనోహా టౌన్ షిఫ్ కింద 100కు పైగా ఇండ్ల నిర్మాణం చేప‌ట్టారు. నిర్మాణ వ్య‌యం అధికం కావ‌డంతో ల‌బ్దిదారులు కొనుగోలుకు ముందుకు రాలేక పోయారు. అయిన‌ప్ప‌టికి అప్ప‌ట్లోనే 20కి పైగా ఇండ్ల‌ను ల‌బ్దిదారుల‌కు అప్ప‌గించారు. తెలంగాణ ప్ర‌భుత్వం రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల వేలానికి నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా తాండూరులో మిగిలిన 72 ఫ్లాట్ల‌లో మొద‌టి విడ‌త‌గా గ‌త మార్చిలో 17 ఫ్లాట్ల‌కు వేలం నిర్వ‌హించారు. గ‌జానికి రూ. 10వేల ధ‌రావ‌త్తును నిర్ణ‌యించ‌డంతో ల‌బ్దిదారుల నుంచి స్పంద‌న రాలేదు. దీంతో 17 ప్లాట్ల వేలంలో 4 మాత్ర‌మే వేలం వేయ‌బ‌డ్డాయి. తాజాగా మ‌రోసారి మిగిలిన ప్లాట్ల‌ను వేలం వేయాల‌ని నిర్ణ‌యించారు. జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల ఆధ్వ‌ర్యంలో అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే రెండు సార్లు ల‌బ్దిదారుల కోసం ఫ్రీబిడ్ స‌మావేశాలు నిర్వ‌హించారు. వ‌చ్చేనెల 8న మ‌రోసారి ఫ్రీబిడ్ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండో విడ‌త‌లో 16 ఫ్లాట్ల‌ను వేలం వేసేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వ‌చ్చేనెల 14న వేలం వేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ సారి కూడ గ‌జానికి రూ. 10 వేలు ధ‌ర నిర్దారించారు. వేలంలో పాల్గొనే వారు ఈఎండీ రూ. 10వేలు చెల్లించాల్సి ఉంటుంద‌ని, పాత నిబంధ‌న‌లే వ‌ర్తించే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.