ఇంటి వద్దకే ఆధార్..!
– ఐదేండ్ల చిన్నారులకు ఉచిత సేవలు
– తపాల శాఖ ఆధ్వర్యంలో అందుబాటులోకి
– వికారాబాద్, మెదక్ జిల్లాలో రెండు రోజుల్లో ప్రారంభం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దేశంలో ప్రతి పౌరుడు ఆధార్ కార్డును నమోదు చేసుకుంటున్నాడు. పెద్దలైతే కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకుని ఇబ్బందులు పరిష్కరించుకుంటారు. కాని చిన్నారుల ఆధార్ కార్డును పొందేందుకు అవస్థలు పడుతుంటారు. త్వరలోనే చిన్నారుల తల్లిదండ్రులకు ఈ ఇబ్బందులు దూరం కాబోతున్నాయి. తపాలా శాఖ ఆధ్వర్యంలోనే ఈ సేవలకు కారం చుట్టబోతుంది. ఉత్తరాల చేరవేతకు పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు అందిస్తూ ప్రజలకు చేరువవుతోంది. ఇప్పటికే హెడ్ పోస్టాఫీసులతో పాటు ఇతర తపాలా కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. చిన్న పిల్లలతో ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం.. ఇంటికే తపాలా శాఖ సిబ్బంది వెళ్లి ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
చిన్నారుల వివరాల సేకరణ
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇంటి వద్ద చిన్నారుల ఆధార్ నమోదుకు అనుమతినిచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్ (ఐపీబీఐ) ద్వారా ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. వీరిలో ఆధార్ కార్డు లేని వారిని గుర్తిస్తారు. వారి ఇంటి వద్దకు గానీ, సమీపంలోని ఓ ప్రభుత్వ భవనం వద్దకు గానీ పిలిపించి చరవాణిలో చిత్రాలు తీసి ఆధార్ నమోదు ప్రక్రియ చేపడుతారు. పిల్లల వేలిముద్రలు స్పష్టంగా రాకపోతే.. తల్లిదండ్రుల వేలి ముద్రలు తీసుకొని అప్డేట్ చేస్తారు. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. దీంతో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోని 3.20 లక్షల ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది.



