టీచర్లకు తీపికబురు..!
– పరస్పర బదిలీలకు ఆమోదం
– 2,558 ఉపాధ్యాయులకు ప్రయోజనం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు టీచర్లకు సర్కారు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖలో ఉపాధ్యాయుల మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్‌లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ, కొంతమందిని కొత్త జిల్లాలకు పంపింది. అయితే, పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గ దర్శకాలు వెలువరించింది.



