ముదురుతున్న కరోనా
– వచ్చే ఆరు వారాలు జాగ్రత్తలు తప్పనిసరి
– పండగలు, ఫంక్షన్లలో మాస్కులు మస్ట్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధిః తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా మహమ్మారి కలవర పెడుతోంది. రోజూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముదురుతున్న కరోనాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు సూచిస్తున్నారు. రాష్ట్రంలో మరో 6 వారాల పాటు కొవిడ్ కేసులు పెరగవచ్చని చెప్పారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదని అన్నారు. కానీ, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరో 6 వారాల పాటు కొవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. రోజుకు 3 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పండగలు, ఫంక్షన్లలో పాల్గొనేవారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. జాగ్రత్తలు పాటిస్తూ, వైరస్ సోకకుండా చూసుకోవాలని చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 24 గంటల్లో 28,808 మందికి కరోనా టెస్టులు చేయగా.. 496 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినుంచి మరో 205 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,613 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లెలిపింది. కొత్తగా మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 99.03 శాతంగా ఉంది. మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు ఉన్నాయని వెల్లడించారు. అందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. అర్హులకు ప్రికాషన్ డోస్ ఇస్తున్నట్టు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు.



