ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితారెడ్డి
– ఫస్టియర్‌లో 63.32 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 67.16 శాతం
– ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
హైదారాబాద్, దర్శిని ప్రతినిధిః తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 62శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరంలో 4,64,892 మంది విద్యార్థులు హాజరవగా.. ఇందులో 2,94,378 మంది పాసవగా.. 63.32శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్‌లో 4,14,380 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 2,68,763 మంది పాసవగా.. 64శాతం ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌లో 50,512 మంది పరీక్షలు రాయగా.. 25,615 మంది ఉత్తీర్ణత సాధించగా.. 54.25శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 72.33శాతం, బాలుర 54.25శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,42,895 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,97,458 మంది ఉత్తీర్ణత సాధించారు. 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 75.33శాతం, బాలురు 59.21 శాతం పాసయ్యారు.
వచ్చే నెల 1నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గడిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్‌లైన్‌లో బోధన చేశాం. గతేడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్‌లు కూడా నిర్వహించామని పేర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తాం. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
ఫలితాలను చెక్ చేసుకోండిలా
విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.inతోపాటు వీటిలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్ షీట్‌ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.



