జన జీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు
– శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ రోజు సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా శాఖలు అప్రమత్తంగా ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలతో నేరుగా సంబంధాలుండే అన్ని శాఖలు నిరంతరం పనిచేసే విధంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. భారీ వానల నేపథ్యంలో ఎగువ గోదావరి నుంచి వరద ముంచుకొస్తున్నందు వల్ల ఎస్సారెస్పీ లో నీరు చేరుతున్న పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున ఆ జిల్లాపై ఎక్కువ దృష్టిని సారించి, తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రెస్య్కూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైనచోట హెలికాప్టర్ లను వినియోగించి రక్షణ చర్యలను చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ముంపు పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి, ప్రతి ఆరు గంటలకొకసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లను ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేయాలన్నారు. ఏటూరు నాగారం, రామన్న గూడెం ప్రాంతాల వరద ముంపు అధికంగా ఉందని అధికారులు సీఎం కు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ కు సూచించారు. వానల నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్థితులను వెంటవెంటనే సీఎం కార్యాలయానికి తెలియజేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని టీఎస్పీడీసీఎల్ సిఎండి రఘురామ రెడ్డి సీఎంకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ శ్రీ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ ఎస్. మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు శ్రీ కె.పి. వివేకానంద, శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, శ్రీ బేతి సుభాష్ రెడ్డి, శ్రీ ముఠా గోపాల్, శ్రీ మాగంటి గోపీనాథ్, ఉన్నతాధికారులు సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీ ఎస్. నర్సింగ రావు, సెక్రటరీలు శ్రీమతి స్మితా సబర్వాల్, శ్రీ వి.శేషాద్రి, శ్రీ రాహూల్ బొజ్జా, శ్రీ రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సీఎం ఒఎస్డీలు శ్రీమతి ప్రియాంక వర్గీస్, శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఎంఎ అండ్ యుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అర్వింద్ కుమార్, పిఆర్ అండ్ ఆర్ డి సెక్రటరీ శ్రీ సందీప్ సుల్తానియా, జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, పిఆర్ అండ్ ఆర్ డి డైరెక్టర్ శ్రీ ఎం.హన్మంత రావు, పిఆర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ సంజీవ రావు, ఎన్ హెచ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి, పోలీస్ కమిషనర్లు శ్రీ సివి ఆనంద్, స్టీఫెన్ శ్రీ రవీంద్ర, శ్రీ మహేష్ భగవత్, హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్న పాల్గొన్నారు.



