‘డబుల్‌’ పంచేద్దాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘డబుల్‌’ పంచేద్దాం..!
– పంపిణీకి మొదలైన కసరత్తు
– పట్టణంలో అర్హుల వడబోత
– ఇందిరమ్మ కమిటీలదే నిర్ణయం కీలకం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ప్రాంత వాసులకు ఇది శుభవార్తే. ఏన్నో ఏండ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అందించేందుకు అధికార యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది. తాండూరు పట్టణంలోని లబ్ధిదారుల ఎంపికకు ప్రక్రియను ముమ్మరం చేశారు.

తాండూరు పట్టణ పరిధిలో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు సంబంధించిన చేపట్టిన 1,050 యూనిట్ల నిర్మాణంలో తాండూరు పట్టణానికి సంబంధించి 428 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. 581యూనిట్ల నిర్మాణం పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పాలన కింద డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. పట్టణంలోని వార్డుల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దరఖాస్తులను కూడా స్వీకరించింది. కొన్ని కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయ్యింది. తాజాగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చొరవతో డబుల్‌ బెడ్‌ ఇండ్ల పంపిణీకి ముందడగు పడింది.

అర్హుల వడబోత
పట్టణంలో డబుల్ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీపై అధికారులు, నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజా పాలనలో డబుల్ బెడ్‌ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్రోడికరించి లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నారు. లెవల్-1, లేవల్-2, లెవల్‌-3 విభాగాలలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించనున్నారు. పట్టణంలోని మున్సిపల్ అధికారులతో పాటు మాజీ కౌన్సిలర్లు, కోర్‌ కమిటిల నిర్ణయం కీలకంగా మారబోతోంది. అధికారులు, నేతలు కలిసి నిజమైన అర్హులను పారదర్శంగా గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. మొదట ఇళ్లు పేదలకే ప్రాధాన్యం ఇస్తూనే అర్హుల దరఖాస్తులు ఎక్కువ వస్తే లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసేందుకు నిర్ణయించారు.

త్వరలో పంపిణీకి చర్యలు : మున్సిపల్ కమీషనర్ యాదగిరి
డబుల్ బెడ్‌ రూం ఇండ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. మొదట తాండూరు అర్బన్‌లో పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమవేశం జరిగింది. అందరి సమన్వంతో అర్హులను గుర్తించి పంపిణీకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఇదికూడా చదవండి…

మిషన్ భగీరథకు ‘బ్రేకులు’..!