విపత్తులపై అప్రమత్తం
– దేనికైనా సిద్దంగా ఉండాలి
– అన్ని శాఖల సమన్వయం ముఖ్యం
– సమీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వర్షాలతో ఏర్పడే విపత్తులపై అందరు అప్రమత్తంగా వ్యహరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం మంత్రి సబితారెడ్డి వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రాబోయే 24 గంటలు చాలా ముఖ్యమని అన్నారు. వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదరవకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 పనిచేసే కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వాగులు, నదుల వద్ద సహాయ చర్యలను చేపట్టాలన్నారు. మరోవైపు కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండ్ల నుంచి బయటకు రాకుండా, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పి ఎన్. కోటిరెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ, జడ్పీ సిఈఓ జానకి రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



