క‌య్యాలు వ‌ద్దు.. క‌లిసి సాగండి

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

క‌య్యాలు వ‌ద్దు.. క‌లిసి సాగండి
– జిల్లాలో పార్టీ ప‌టిష్ట‌త‌కు ప‌నిచేయండి
– సునిత‌మ్మ పంచాయ‌తిని చ‌ల్లార్చిన మంత్రి కేటీఆర్
– మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్ ప‌ర్స‌న్
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌య్యాల‌కు పోకుండా అంద‌రు స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌నిచేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లా నేత‌లుకు సూచించారు. ప్రోట్రోకాల్ వివాదంతో జిల్లాలోని మ‌ర్ప‌ల్లి మండ‌లంలో వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితా మ‌హేంద‌ర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్య‌క్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ వ‌ర్గాల మ‌ద్య కార్చిచ్చు రేగిన విష‌యం తెలిసిందే. ఈ పంచాయ‌తీ మంత్రి కేటీఆర్ వ‌ద్ద‌కు చేర‌డంతో దానిని చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేశారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిల‌తో క‌లిసి జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునితా మ‌హేంద‌ర్ రెడ్డి మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటిలో వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ కూడ ఉండ‌డం విశేషం. జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ఇరువురు మ‌రోసారి కేటీఆర్ దృష్టికి తీసుక‌వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ అందరూ కలిసికట్టుగా.. సమన్వయంతో పనిచేయాలని సూచించడంతో పాటు టీఆర్ఎస్ పార్టీని జిల్లాలో మ‌రింత ప‌టిష్ట ప‌ర‌చాల‌ని సూచించిన‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. మొత్తానికి జిల్లాలోని కారులో రేగిన వ‌ర్గ చిచ్చును మంత్రి కేటీఆర్ చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు నేత‌లు ద్వారా తెలిసింది. శ‌నివారం హైద‌రాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన వారిలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు ఉన్నారు.