10 కాదు, 20 కాదు.. ఇక రూ. 50వేలు

కెరీర్ జాతీయం తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

10 కాదు, 20 కాదు.. ఇక రూ. 50వేలు
– వీధి వ్యాపారుల‌కు పెరిగిన రుణం
– ఆత్మ‌నిర్భ‌ర్ నిధి మూడో విడ‌తలో పంపిణీకి నిర్ణ‌యం
– ఎవ‌రు అర్హులో.. ఎలా చెల్లించాలో తెలుసుకోండి..
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ నిధి(పీఎం స్వనిధి) ప‌థ‌కం వీధి వ్యాపారుల‌కు వ‌రంగా మారింది. ఈ ప‌థ‌కం ద్వారా వారికి ఒకేసారి రూ. 50 వేల రుణాల‌ను అంద‌జేయ‌బోత‌న్నారు. కరోనా నేపథ్యంలో వీధి, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్ర‌భుత్వం 2020 నుంచి ఈ ప‌థ‌కాన్ని అమలు చేస్తోంది. మొద‌ట్లో ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి నామమాత్రపు వడ్డీతో రూ.10 వేలు రుణంగా అందించారు. రోజు వారి టోకున కొనుగోలు చేసి, చిల్లరగా వ్యాపారం చేసే వారు ప్రైవేటులో వడ్డీకి నూటికి రూ.5 నుంచి రూ.10 వరకు చెల్లించాల్సి వస్తుంది. పీఎం స్వనిధి పథకంలో తక్కువ వడ్డీతోపాటు, సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం ఉండడంతో ఉపాధికి ఊతం లభించినట్లయింది. వీధి వ్యాపారులే కాకుండా ఇళ్లలోనే ఉంటూ దుస్తులు కుట్టేవారు, వంటకాలు తయారు చేసి విక్రయించేవారు. ఇలా ఎందరికో ఈ రుణం ఉపయోగపడింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో, రెండో విడతలో రూ.20 వేలు ఇచ్చారు. రెండు విడతల రుణాన్ని వినియోగించుకొని, అప్పు తీర్చిన వారికి అండగా నిలిచేందుకు ఈ దఫా రూ.50 వేలు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పట్టణ ప్రగతి కార్యక్రమంతో కలిపి అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది.

మూడో విడ‌త కింద రుణాలు
ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి, రెండో విడ‌త‌ల్లో కొన‌సాగిన‌ పీఎం స్వనిధి పథకాన్ని 2024 వరకు మూడో విడత కింద‌కు పొడిగించారు. మొదటి దశలో రూ.10 వేల రుణాన్ని 12 కిస్తుల్లో చెల్లించే అవకాశం ఇచ్చారు. రెండో దశలో తీసుకున్న రూ.20 వేల రుణాన్ని 15 నుంచి 18 కిస్తుల్లో చెల్లించే వీలు కల్పించారు. మూడో విడత కిందనే చిరు వ్యాపారులకు రూ.50 వేలు రుణాలు అంద‌జేయ‌నున్నారు. మున్సిపల్‌ పరిధిలో వీధి వ్యాపారులుగా గుర్తింపు పొందిన వారు, మొదటి, రెండో విడత రుణాలు తీసుకొని బ్యాంకులకు అప్పు చెల్లించిన వారు మూడో విడతకు అర్హులు. బ్యాంకులకు ఇప్పటికే అవసరమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అదనపు కలెక్టర్లు, లీడ్‌ బ్యాంకు మేనేజర్లు, మెప్మా జిల్లా పీడీలు ఈ విషయమై బ్యాంకు అధికారులతో భేటీ అవుతున్నారు. అవసరమైన వారు మున్సిపల్‌ మెప్మా అధికారులను సంప్రదిస్తే సహకరిస్తారు. మూడో విడ‌త‌లో రుణాలు తీసుకుంటే 36 వాయిదాల్లో చెల్లించే అవకాశముంది.