దేశ పురోగ‌తికి నిరంత‌ర కృషి

జాతీయం తెలంగాణ రాజకీయం

దేశ పురోగ‌తికి నిరంత‌ర కృషి
– రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము
– 15 వ రాష్ట్ర‌ప‌తిగా, గిరిజ‌న తొలి మ‌హిళ‌గా రికార్డు

హైదరాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశ పురోగ‌తే సంక‌ల్పంతో ముందుకుసాగి నిరంత‌ర కృషి చేస్తామ‌ని భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భార‌త 15వ రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ద్రౌపది ముర్మును పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి తొడ్కొని వచ్చారు. అనంత‌రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆమెతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ సంద‌ర్భంగా ద్రౌప‌ది ముర్ము మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్‌ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చానని, ఆదివాసీ గ్రామం నుంచి నా ప్రయాణం మొదలైందని అన్నారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని, మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న బాలికగా నేనేనని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం నా వ్యక్తిగత విజయం కాదని, ఆదివాసీ, దళితుల విజయమన్నారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం ధన్యవాదాలు తెలిపారు. మీ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశ ప్రజలకు కార్గిల్‌ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌కు ప్రశంసలు కురిపించారు. నాపై మీరు ఉంచిన నమ్మకమై నా బలమని వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులున్నా సంకల్పంతో ముందుకెళ్లాలని, వచ్చే 25 ఏళ్లలో అద్భుమైన పురోగతి సాధించాలన్నారు. ఒకప్పుడు చదువుకోవడం నా కల.. ఇప్పుడు రాష్ట్రపతి అయ్యాను అని చెప్పుకొచ్చారు. మ‌రోవైపు భార‌త రాష్ట్ర‌ప‌తి పదవిని చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకి చేరారు. అలాగే, అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతి పిన్న వయసు వ్యక్తి కూడా ఆమె కావడం గమనార్హం. ఇటీవలి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై గెలవడం తెలిసిందే.