సీజనల్ వ్యాధులపై అప్రమత్తం..!
– పట్టణంలో సర్వే ప్రారంభించిన అధికారులు
– వార్డుల్లో పర్యటించి వివరాల సేకరణ
– పరిసరాల పరిశుభ్రత, వ్యాక్సీనేషన్పై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో సీజనల్ వ్యాధులపై అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో సీజనల్ వ్యాధుల నియంత్రణతో పాటు వ్యాక్సీనేషన్పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అంగన్ వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు, ఆశ వర్కర్లు, మున్సిపల్ జవాన్లతో 9 మందితో కూడిన 9 బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి పీవర్ సర్వేను ప్రారంభించారు. పట్టణంలోని 9,10,11 వ వార్డులో కొనసాగిన ఫీవర్ సర్వేను మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ఆరా తీశారు. అదేవిధంగా కరోనా వ్యాక్సీనేషన్, బూస్టర్ డోసు తీసుకోవడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇంటి పరిసరాలను పశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫీవర్ సర్వేకు అందరు సహకరించాలన్నారు. అర్హులైన వారు కరోనా వ్యాక్సీనేషన్, బూస్టర్ డోసు తప్పక వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ నీరటి శ్రీనివాస్, ప్రత్యేక బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.



