ఫ‌స్ట్ దొంగ‌త‌నం.. ప‌దిరోజుల్లో ప‌ట్టుబ‌డ్డారు..!

క్రైం తాండూరు వికారాబాద్

ఫ‌స్ట్ దొంగ‌త‌నం.. ప‌దిరోజుల్లో ప‌ట్టుబ‌డ్డారు..!
– పాతిపెట్టిన సోత్తుకోసం వ‌చ్చి దొరికిన దొంగ‌లు
– పాత తాండూరులో ఘరానా చోరీని చేధించిన పోలీసులు
– 12న్నర తులాల ఆభరణాలు, రూ.25 వేల రికవరీ
– వివరాలు వెల్లడించిన డీఎస్సీ జి. శేఖర్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : బ‌త‌క‌డం కోసం ఒక‌రు ఫ్లోరింగ్ ప‌నులు చేస్తుంటే.. మ‌రోక‌ర‌కు వాల్ పేయింటింగ్ చేస్తున్నారు. డ‌బ్బుల కోసం వ‌క్ర‌బుద్ది పుట్టి ప‌క్కింట్లోనే దొంగంత‌నం చేశారు. ఫ‌స్ట్ టైం దొంగ‌త‌నం చేసి ప‌దిరోజుల‌లోనే పోలీసుల‌కు చిక్కారు. ఇంకేముందే పోలీసులు వారిని క‌ట‌క‌టాల్లోకి పంపారు. గ‌త నెల 23వ తేదిన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి పాత తాండూరు మోమిన్ గ‌ల్లిలో జ‌రిగిన ఘ‌రానా చోరీ కేసును చేధించారు.

బుధ‌వారం తాండూరు డీఎస్పీ జీ.శేఖ‌ర్ గౌడ్ కేసు వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. పాత తాండూరులోని మోమిన్ గల్లిలో సిరాజ్ సందాని, మిరాజ్ సందానిలు ఒకే దగ్గర ఉంటున్నారు. గత నెల 22న సిరాజ్ సందాని కూతురు వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన మ‌హమ్మ‌ద్ ముస్త‌ఫా ఫ్లోరింగ్ ప‌నులు చేస్తుండ‌గా.. మ‌హ‌మ్మ‌ద్ ఉస్మాన్ అలియాస్ ముస్కాన్‌లు పేయింటింగ్ ప‌నులు చేస్తుంటారు. దీంతో వీరి ఇద్ద‌రి మంచి ప‌రిచ‌యం ఉంది. అయితే గ‌త‌నెల 23న రాత్రి సిరాజ్ సందాని కూతురుకు సంబంధించిన వివాహ వేడుక‌ల‌ను పట్టణంలోని నేషనల్ గార్డెన్లో నిర్వ‌హించారు. ఈ వేడుకలో రెండు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఎప్ప‌టినుంచో వారి ఇంటిపై క‌న్నేసిన ముస్త‌ఫా, ముస్కాన్‌లు ఇదే అదునుగా భావించి అదే రోజు అర్ధరాత్రి దొంగ‌త త‌నానికి పాల్ప‌డ్డారు.

సొత్తు పాతిపెట్టి ప‌రారి

చోరీ చేసేందుకు వేసుకున్న ప్లాన్ ప్ర‌కారం అదే రోజు రాత్రి వారింటి వెనుకభాగంలో నుంచి మిరాజ్ సందా ఇంట్లోకి ప్రవే శించారు. ముందుగా ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎక్కి ముస్తఫా రెండు కాళ్లతో ఇంటి తలుపును స్క్రూ డ్రైవర్ తో కొండి విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. చెక్క బీరువా పక్కన ఉన్న తాళం తీసుకుని బీరువా తెరిచి అందులోని 12న్నర తులాల గాజులు, చైన్లు, మంగళసూత్రం బంగారు ఆభరణాలతో పాటు రూ.30వేల నగదును దొంగతనం చేశారు. అనంతరం ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్లో గుంత తవ్వి బంగారు ఆభరణాలు, రూ. 25 వేల నగదును పూడ్చి రూ. 5వేలు తీసుకుని అక్కడి నుంచి ప‌రార‌య్యారు. ఇక్క‌డి నుంచి వెళ్లిపోయిన నిందితులు గుల్బర్గా, ముంబయ్ ప్రాంతాలకు పారి పోయారు.

ఇలా ప‌ట్టుబ‌డ్డారు

చోరి జరిగిన నాటి నుంచి పోలీసులు అనుమానితులపై దృష్టి సారించారు. ఆ రోజు నుంచి అదృశ్యమైన వారిపై నిఘా ఉంచారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పాతి పెట్టిన సొత్తు కోసం ముస్తఫా, ముస్కాన్‌లు తాండూరుకు వ‌చ్చారు. బుధవారం ఉదయం పాతి పెట్టిన బంగారం, డబ్బులను తీసుకునేందుకు యత్నిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులు దొంగిలించిన బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ జి. శేఖర్ గౌడ్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, సిబ్బంది అంజద్‌, శివ‌వలను అభినందించి… రివార్డులను అందజేశారు.