కోడంగల్ గులాబీలో అలజడి..!
– వైఎస్సార్ టీపీలోకి గురునాథ్ రెడ్డి..?
– వైఎస్ షర్మిల పాదయాత్రలో ప్రత్యక్ష్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు డివిజన్లోని కోడంగల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీలో అలజడి రేగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనీయర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వైఎస్ఆర్ టీపీ పార్టీ అధినేత్రి షర్మిల చేపట్టిన పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఈ సంఘటన నియోజకవర్గ, జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశమైంది. కొడంగల్ కు గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన గురునాథ్ రెడ్డి గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీకీ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రచారం సాగింది. అనూహ్యంగా మంగళవారం వికారాబాద్ జిల్లాలో సాయంత్రం వైయస్సార్ టీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో గురునాథ్ రెడ్డి ప్రత్యక్షం కావడంతో గులాబీ పార్టీలో అలజడిని రేకెత్తించింది. ఆ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాత్రలో గురునాథ్ రెడ్డి పాల్గొనడంతో ఆయన ఆ పార్టీలో చేరుతున్నట్లు స్థానిక నేతలు నిర్ణయానికి వచ్చారు. మరోవైపు వైఎస్ఆర్ టీపీ పార్టీ జిల్లాలో పాగ వేస్తోంది. ఇటీవల వికారాబాద్ లో దివంగత మాజీ ఎమ్మెల్యే సంజీవరావు సతీమణి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగానే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి షర్మిల యాత్రలో కనిపించడం చర్చనీయాంశమైంది. గురునాథ్ రెడ్డి చేరికతో వైఎస్ఆర్ టీపీ మరింత బలపడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.



