మెరుగైన సేవలతో గుర్తింపు
– వైద్యుల కృషితో ఆసుపత్రికి ప్రతిష్ట
– కాయకల్ప అవార్డు అభినందనీయం
– బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శినిప్రతినిధి: సర్కారు దవాఖానలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోనే వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి మంచి గుర్తింపు లభించిందని బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో కందుకూరి రాజ్ కమార్ స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్‌ను కలిసి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి పనితీరు మెరుగుపడిందన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రత, నిర్వహణ వంటి అంశాలలో 92 శాంతం మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కృషి వల్లే కాయకల్ప అవార్డు రావడమే, రూ. 25 లక్షల ప్రోత్సహాం రావడం చాలా సంతోషకరం అన్నారు. ఇదే స్పూర్తితో నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. వైద్యులతో పాటు సిబ్బంది రోగుల పట్ల బాధ్యతగా మెలగాలని కోరారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, నియోజకవర్గ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు నాయకుడి జ్యోతి, జిల్లా బీసీ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, చంద్ర శేఖర్, గుండు, సయ్యద్ మున్నా, సోనీ బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.


