బీజేపీని దేశం నుంచి తరిమేయాలి
– మోడి పాలనలో అభివృద్ధి సాధించిందేమి లేదు
– ఈడీ బోడీలకు భయపడేది లేదు
– మునుగోడు రాష్ట్రానికి బతుకుదెరువు ఎన్నిక
– బీపేపీపై మండిపడిన సీఎం కేసీఆర్
– సీపీఐ, సీపీఎంతో కలిసి పనిచేస్తాం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మునుగోడు వేదికగా నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ కమలం పార్టీపై మరోసారి కదంతొక్కారు. మోదీ అహంకారమే ఆయనకు శత్రువన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రభుత్వాలను కూల గొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఏడాదిలో ఎన్నికలు వస్తుండగా.. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చింది? గోల్‌మాల్ బైపోల్ అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ నిలదీశారు. కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చలేదో చెప్పాలంటూ అమిత్ షా ను డిమాండ్ చేశారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు. దీని వెనుక చాలా మతలబు ఉందంటూ వివరించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం ఏమి అభివృద్ధి సాధించిందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించిన ఆయన.. దేశంలో అన్నీ అమ్మేస్తున్నారని ఫైరయ్యారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న తెలంగాణ.. కరెంట్ కూడా కొనకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. అదేవిధంగా బీజేపీ కనుసన్నలలో కొనసాగుతున్న ఈడీ బోడీలకు భయపడేదే లేదన్నారు. వాటికి దొంగలు భయపడతారు.. తాము కాదంటూ పేర్కొన్నారు. ఏ ప్రధాన మంత్రి టైమ్‌లో లేనంత దారుణంగా ఇప్పుడు రూపాయి విలువ పడిపోయిందన్నారు. అందరం కలిసి బీజేపీకి మీటర్ పెట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు ఒక్క కేసీఆర్ అయి.. బీజేపీ మీద పోరాటం చేయాలన్నారు. మత విద్వేశాలను రెచ్చగొడుతున్న బీజేపీని తరిమికొట్టాలని పేర్కొన్నారు. మరోవైపు మూడు తోకలు కూడా లేని పార్టీలు.. ఏక్ నాథ్ సిండేలను తీసుకొస్తాంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటే వేస్తే.. అది వ్యర్ధమైనట్టే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మునుగోడులో వచ్చేది ఉప ఎన్నిక మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల బతుకు దెరువు ఎన్నిక అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా తీర్చిదిద్దామని తెలిపారు. భవిష్యత్తులో కూడా సీపీఐ, సీపీఎంతో పనిచేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా.. మునుగోడు అభ్యర్థి ప్రకటనపై మాత్రం కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు.


