స్కూళ్ల రీ ఓపెనింగ్ పై హైకోర్టు స్టే
దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెనింగ్ పై హైకోర్టు స్టే విధించింది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధన వద్దని దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ స్టే విధించింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులు హాజరు కావాలని ఒత్తిడి తీసుకు రావద్దని పేర్కొంది. వారం రోజుల వరకు గురుకులాలు, వసతి గృహాలను సైతం తెరవరాదని హైకోర్టు స్టేలో స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది.
అయితే అనూహ్యంగా హైకోర్టు ఆదేశాలతో అన్నింటికి బ్రేక్ పడింది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ఏంటని.? ఇలాంటి సమయంలో పాఠశాలలను తెరవడం మంచిది కాదంటూ ప్రైవేట్ స్కూల్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వారం పాటు స్కూల్స్ ప్రారంభంపై స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లోని వసతి గృహాలను తెరవద్దని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే స్కూల్స్ రావాలని విద్యార్ధులను బలవంతం చేయకూడదని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్ధులపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ బోధనపై తుది నిర్ణయం పాఠశాలలదేనని హైకోర్టు పేర్కొంది. ప్రైవేటు స్కూల్స్‌కు విద్యార్ధులను పంపడంపై తల్లిదండ్రుల విచక్షణకే వదిలేస్తున్నామంది. ఆఫ్‌లైన్ బోధనపై స్కూల్స్‌కు వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.

