రాజాసింగ్‌పై బీజేపీ వేటు
– పార్టీ నుంచి సస్పెండ్
– షోకాజ్ నోటీసు అందజేత
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై ఆ పార్టీ వేటు వేసింది. బీజేపీ నుంచి స్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు తొలగించ కూడదో 10రోజుల్లో తెలపాలని అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మునావర్ హైదరాబాద్‌కు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినా.. పోలీసులు ఆయనకు భద్రత ఎలా కల్పించారని రాజాసింగ్ ప్రశ్నించారు. తనపై ఏ యాక్షన్ తీసుకున్నా సిద్ధమే అని ప్రకటించారు. ధర్మంకోసం చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భగ్గు మన్న ఎంఐఎం శ్రేణులు పాతబస్తీలో ఆందోళన చేపట్టాయి. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో రాజాసింగ్‌ను షాహినాయత్ గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సోషల్ మీడియాలో రాజాసింగ్ పెట్టిన వీడియోపై మజ్లిస్ ఆందోళనలు చేపట్టింది. మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీసుస్టేషన్ల ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి విరుద్దంగా వ్యవహరించడంతో తక్షణమే రాజాసింగ్‌కు ఇచ్చిన బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్‌లో రాజాసింగ్ వీడియోను తొలగించబడింది.


