పోలీసుల కృషితోనే సాఫీ నిమజ్జనం
– డీఎస్పీ, సీఐ, సిబ్బందిని సన్మానించిన సంగీత ఠాకూర్
– పోలీసులకు గణేష్ మెమెంటోల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: పోలీసుల కృషితోనే తాండూరులో వినాయక నిమజ్జనం సాఫీగా జరిగిందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ పేర్కొన్నారు. ఇటీవల తాండూరులో ప్రతిష్టించిన వినాయక చవితి, నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంలో పోలీసుల పాత్రపై హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐలను సంగీత ఠాకూర్ ఆధ్వర్యంలో సన్మానించారు. అదేవిధంగా గాంధీ నగర్ వినాయక ఉత్సవ సమితి సభ్యులతో కలిసి గణేష్ మెమెంటోలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు తాండూరులో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా ముగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శోభాయాత్రలో ఎలాంటి అల్లర్లు, అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు అభినందనీమయన్నారు. పోలీసుల బందోబస్తు చర్యలతోనే నిమజ్జనం సాఫీగా జరిగిందన్నారు. డీఎస్పీ, సీఐలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డిలు మాట్లాడుతూ వినాయక చవితి, నిమజ్జన ఉత్సవాలలో అందరు సహకరించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కూడ ఇలాంటి సహాయ సహాకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ వినాయక ఉత్సవ సమితి సభ్యులు, యువకులు పాల్గొన్నారు.


