వ్యాపారికి టోకరా..!
– ఆర్మీ వ్యక్తినంటూ మోసం
– డ్రెస్ కోడ్ పేరుతో రూ.12 వేలు వసూలు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేను ఆర్మీ మ్యాన్‌ను.. తాండూరులో కొత్తగా ఆర్మీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాము.. మా కోచింగ్ సెంటర్‌కు భోజనం సర్వీసు చేయాలి.. దీనికి డ్రెస్ కోడ్ ఉంటుందని.. అందుకు రూ. 12 వేలు చెల్లించాలని.. పట్టణానికి చెందిన ఓ హోటల్ వ్యాపారిని బుట్టలో వేసుకున్నాడు. అతని వద్ద నుంచి రూ. 12వేలు వసూలు చేసి పరారయ్యాడు. ఈ సంఘటన బుధవారం తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సీతారాం పేటకు చెందిన జమీల్ తన సోదరుడి పేరుతో లారీ పార్కింగ్ వద్ద సోహెల్ హోటల్ నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం వేళ ఓ గుర్తుతెలియని వ్యక్తి హోటల్ కు వచ్చి తను ఆర్మీకి సంబంధించిన వ్యక్తిగా జమీల్‌తో పరిచయం చేసుకున్నాడు. రేపటి నుంచి పట్టణంలోని రాజీవ్ గృహ కల్ప సమీపంలో ఆర్మీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నామని, 40 మందికి భోజనం సర్వీసు చేయాలని తెలిపారు. తమ కోచింగ్ సెంటర్ కు భోజనం సర్వీసు చేయాలంటే డ్రెస్ కోడ్ తప్పని సరి అని, ముగ్గురు వ్యక్తులకు రూ. 4 వేల చొప్పున మొత్తం 12 వేలతో ఈ సదుపాయాన్ని పొందవచ్చని నమ్మించాడు. అంతా నమ్మిన జమీల్ డబ్బులు ఎక్కడ చెల్లించాలని అడిగాడు. ఆర్మీ వ్యక్తి కోర్టులో చెల్లించాలని అక్కడికి రమ్మని సూచించాడు. కోర్టుకు వెళ్లిన జమీల్ అక్కడ మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను కలిసి మాట్లాడాడు. ముందుగా రూ. 12 వేలు చెల్లించాడు. అయితే అంగీకారానికి స్టాంపులు కావాల్సి ఉంటుందని, పోస్టాఫీసుకు వెళ్లి వాటిని తీసుకరావాలని చెప్పారు. దీంతో జమీల్ పోస్టాఫీసుకు వెళ్లి వచ్చే సరికి వ్యక్తులు కనిపించలేదు. మోసపోయానని గుర్తించిన జమీల్ వెంటనే తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మోసగాల్ల నుంచి అందరు జాగ్రత్తగా ఉండాలని బాధితుడు జమీల్ తెలిపారు. అదేవిధంగా పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు.


