ప్రైవేటు ఆసుపత్రి, క్లినిక్లపై కొరడా..!

క్రైం తాండూరు వికారాబాద్

ప్రైవేటు ఆసుపత్రి, క్లినిక్లపై కొరడా
– రిజిస్ట్రర్‌ లేని వాటికి తాఖీదులు
– తనిఖిలు చేస్తున్న జిల్లా ఉప వైద్యాధికారి
– నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమతి లేని ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారులు కొరడా జులిపిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు రెండు రోజులుగా తాండూరులో తనిఖీలు చేస్తున్నారు. జిల్లా ఉప వైద్యాధికారి డా.ధరణి కుమార్ ఆద్వర్యంలో వైద్యాధికారులు తాండూరు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులు, క్లీనిక్‌, డయాగ్నోస్టిక్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం తాండూరులో 11 ఆసుపత్రులపై తనిఖీలు చేశారు. శుక్రవారం కూడ డా.ధరణి కుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలను కొనసాగించారు. సాయంత్రం మొత్తం 22 ఆసుపత్రులు, క్లీనిక్ లను తనిఖీ చేసినట్లు డా.ధరణి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నర్సింగ్‌ హోంలు, ఆసుపత్రి, క్లీనిక్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు రిజిస్ట్రర్‌ లేకుండా కొనసాగిస్తున్నారని ప్రభుత్వం గుర్తించి ఈ తనిఖీలు చేయిస్తుందన్నారు. జిల్లాలో మొత్తం రెండు బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. తాండూరు డివిజన్లో 36 రిజిస్ట్రేషన్‌ ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్‌ ఉన్న వాటితో పాటు లేని వాటిపై కూడ తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇందులో ఆసుపత్రిల రిజిస్ట్రేషన్‌, అర్హత కలిగిన డాక్టర్లు ఉన్నారా లేదా.? ఆరా తీయడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్‌ లేని వాటికి జరిమానాలు విధించి నోటీసులు అందజేస్తున్నామన్నారు. వారం లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఆసుపత్రులను సీజ్ చేస్తామని స్ఫష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు 22 ఆసుపత్రులు, క్లీనిక్‌ లను తనిఖీ చేయడం జరిగిందని, ఇందులో తాండూరు నర్సింగ్‌ హోంలో కాల్‌ సెంటర్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. ప్రార్థన క్లీనిక్, విజయ్‌ సాయి డెంటల్‌ క్లీనిక్, లైఫ్ లైన్‌ క్లీనిక్‌, సంజీవని క్లీనిక్, స్మైల్‌ కేర్ డెంటల్‌ క్లీనిక్, గాయత్రి క్లీనిక్‌ జరిమానాలు విధించడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ లేని 11 ఆసుపత్రులకు నోటీసులు అందజేయడం జరిగిందని వివరించారు. ఆసుపత్రుల యజమాన్యాలు తప్పక రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, అర్హత ఉన్న వైద్యులతోనే సేవలు అందించాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ప్రోగ్రాం ఆఫీసర్లు డా.బబిత, డా. రవీందర్‌, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.