స‌మాజంలో అధ్యాప‌కుల పాత్ర మ‌రువ‌లేనిది

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

స‌మాజంలో అధ్యాప‌కుల పాత్ర మ‌రువ‌లేనిది
– రాష్ట్ర బీసీ క‌మీష‌న్ మెంబ‌ర్ శుభప్రద్ పటేల్
– ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపకులకు అవార్డులు
– తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో సన్మానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : స‌మాజంలో భావి తరాలకు బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర మ‌రువ‌లేనిద‌ని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. ఆదివారం వికారాబాద్‌లోని బసంత్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్(టీఎల్ఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డుల ప్రధానోత్స‌వ‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూర్, వికారాబాద్, పరిగి లతో పాటు మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పలు ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఉత్తమ అధ్యాపక అవార్డుల‌ను అందజేసి ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడం లో అధ్యాపకుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. కేవలం పుస్తకాల్లో ఉన్న అంశాలే కాకుండా నైతిక విలువలను నేర్పుతూ వారిని సన్మార్గం లో నడపడం ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అధ్యాపకులది కీలక పాత్ర అన్నారు. ప్రైవేట్ లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీస్కు వెళ్తానన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకుల సేవలను గుర్తించి అవార్డు కార్యక్రమం ఏర్పాటు చేసిన టీఎల్ఎఫ్‌కి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుల్లపల్లి రమేష్, కవి భాస్కర యోగి, టీఎల్ఎఫ్ సభ్యులు సిద్దేశ్వర్, యాదయ్య, రాంచందర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.