కంటి పాపలకు రక్ష..!
– నవజాత శిశువులకు నేత్ర వైద్య సేవలు
– దసరా తరువాత జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి: మానవ శరీరంలో కళ్లు ప్రధానమైనవి. పెద్దలు, చిన్నారుల్లో కంటి సమస్యలు ఎదురైతే చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాని అప్పుడు పుట్టిన శిశువుల్లో ఆ అవకాశం ఉండదు. ఇకపై అలాంటి సమస్యలు రాకుండా నవజాత శిశువుల్లో కంటి సమస్యలను గుర్తించే వైద్య సేవలను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో ఇండియన్ ఇన్సుట్యూట్ ఆఫ్ హెల్త్ ఆర్గనైజింగ్, సికింద్రాబాద్‌లోని పుష్పగిరి ఐ ఇన్సుట్యూట్ వారు సంయక్తంగా తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువులకు నేత్ర వైద్య సేవలను అందించబోతున్నారు. ఇందుకోసం మంగళవారం ఇండియన్స్ ఇన్సుట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగం వైద్యులు డా.అనిరుధ్, పుష్పగిరి ఐ ఇన్సుట్యూట్ వైద్యుడు డా.బాలవిద్యాధర్‌లు జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా.మల్లికార్జున స్వామితో కలిసి ఆసుపత్రిలో కొనసాగుతున్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు.
ఇక్కడ ఎంతమంది శిశువులు కంటి సమస్యలతో బాధపడుతున్నారు..? తీసుకుంటున్న చర్యలేమిటి అనే అంశాలపై వారు సూపరిండెంట్‌తో చర్చించారు. అనంతరం ఆసుపత్రిలో ప్రారంభించే నేత్ర వైద్య సేవలపై చర్చించారు. బరువు తక్కువగా ఉండి.. నెలలు నిండని శిశువుల్లో కంటి సమస్యలు రావచ్చని.. వాటిని ఇప్పుడే గుర్తించకపోతే భవిష్యత్తులు ప్రమాదంగా మారవచ్చన్నారు. ఆసుపత్రిలో శిశువులకు కంటి పరీక్ష సేవలను వచ్చే దసరా తరువాత ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి శిశువులకు కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఆసుపత్రిలో శిశువులకు కంటి పరీక్షలు అందుబాటులోకి రాబోతుండడంపై ఆసుపత్రి సూపరిండెంట్ డా.మల్లికార్జున స్వామి హర్షం వ్యక్తం చేశారు.
