గ్రూప్-1కు బయోమెట్రిక్..!
– నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
– రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు రావాలి
– పరీక్షా కేంద్రాల పోలీసుల బందోబస్తు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ఉద్యోగాల భర్తిలో భాగంగా పదేళ్ల తరువాత నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల తెలిపారు. ఈ పరీక్షల కోసం తొలిసారి బయోమెట్రిక్ విధానం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈనెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని బుధవారం గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై టి యస్ పి యస్ సి చైర్మన్ డాక్టర్ పి. జనార్దన్ రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్ పోలీస్ అధికారులతో లతో వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వం పదేళ్ల తరువాత ఈనెల 16 న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు గ్రూప్-1 పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్ తో పాటు ప్రతి పరిక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూం, పరిక్షా కేంద్రంలోని గేట్ ఏంట్రన్స్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ లలో సీసీ కెమెరాలను, వీడియో కవరేజ్ ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుండి పరిక్షా కేంద్రానికి పరీక్ష మెటీరియల్ ను పోలీస్ బందోబస్తు తో సకాలంలో చేర్చాలన్నారు. పరిక్షా పూర్తి అయ్యేవరకు పాటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలాన్నారు. ఈరోజే చీఫ్ సూపరింటెండెంట్ లతో కలసి సంబంధిత లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు పరిక్షా కేంద్రాలను సందర్శించి విద్యుత్, మరుగుదొడ్లు, పారిశుద్యం, నీటి సదుపాయాల ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పరిక్షా సమయంలో విద్యుత్ అంతరాయం జరుగకుండా చూడాలని, పరిక్షా కేంద్రాల పరిసరాలలో గల జిరాక్స్ సెంటర్ లను మూసివేసి 144 సెక్షన్ విధించాలన్నారు. ఆర్ టి సి బస్సులను సకాలంలో నడపాలని అన్నారు. పరీక్షలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరవుతున్నందున పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.
నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ
పరీక్షలకు అభ్యర్థులు రెండు గంటల ముందే పరిక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10:00 గంటల తర్వాత పరిక్షా కేంద్రములో అనుమతించబడదని, 10:15 గంటలకు పరిక్షా కేంద్రం గేటు మూసివేయడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల తరువాత గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రూప్ -1 పరీక్షలకు తొలిసారిగా బయోమెట్రిక్ అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నం. 7995061192 కు ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు సంప్రదించగలరని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ యస్ పి రషీద్, డి ఆర్ ఓ అశోక్ కుమార్, ఆర్ డి ఓ విజయకుమారి, డి ఎస్ పి సత్యనారాయణ, చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

