సత్ప్రవర్తనతోనే రౌడీషీట్ ఎత్తివేత
– జిల్లాలో 14 మందికి ఊరట
– నిందితులు మళ్లీ నేరాలకు పాల్పడరాదు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సత్ప్రవర్తనతో జీవిస్తున్న నిందితులపై నమోదైన రౌడీషీట్ ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంంటున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం సమద్ ఫంక్షన్ హాల్లో తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో హిస్టరీ షీటర్స్ మేళా నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరై వివిధ పోలీస్టేషన్‌లకు సంబంధించిన హిస్టరీ షీటర్స్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నేరారోపణలతో అనుమానితుల సంఖ్య పెరిగిందన్నారు. రౌడీషీట్ నమోదైన నిందితులు పదేళ్ల పాటు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే వారిపై రౌడీషీట్ తొలగిస్తామని అన్నారు. 39 మందిపై రౌడీషీట్ నమోదైతే ఇటీవలే ఇద్దరిపై రౌడీషీట్ తొలగించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా 161 మంది నిందితులలో 60 ఏండ్లు నిండిన 4 మందితో పాటు 10 ఏండ్ల క్రితం చిన్న చిన్న కేసుల (సెల్ ఫోన్ దొంగతనం, టేప్రికాట్, షటర్స్ తదితర)లో నిందితులుగా ఉన్న మరో 10 మందిపై రౌడీ షీట్ ఎత్తివేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. రౌడీ షీట్ ఎత్తివేసిన నిందితులు, వృద్దులు ప్రశాంతమైన జీవనం సాగించాలని సూచించారు. వివిధ కేసుల్లో పాత నేరస్తులపై పోలీసులు నిరంతర నిఘా ఉంటుందని, నేరాలపై పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. సమాజంలో అందరు శాంతిభద్రతలకు సహకరించాలని అన్నారు.

మరోవైపు ఇరానీ గ్యాంగ్ నిందితులను సాహసోపేతంగా పట్టుకున్న పట్టణ పోలీస్టేషన్ కానిస్టేబుళ్లు శివ, నర్సింలు, షబ్బీల్, అంజద్ తదితరులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, డీఆర్సీబీ సీఐ ఆప్పయ్య, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

