కారు ఎమ్మెల్యేలకు కరెన్సీ ఎర
– నోట్ల కట్టలతో పట్టుబడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
– కాసేపట్లో వివరాలు వెల్లడించనున్న పోలీసులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి చెందిన నలుగురు యత్నించారు. ఇందుకోసం నగర శివారులో రహస్య మంతనాలు జరుపుతుండగా నోట్ల కట్టలతో పోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటన తెలంగాణలో కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెరాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావును పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించినట్టు పోలీసులు చెబుతున్నారు. రెండ్రోజులుగా ఈ నలుగురూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. నగరశివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దీనిపై కాసేపట్లో సైబరాబాద్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.

