రూ. 200 కోట్ల‌తో అనంత‌గిరికి ప‌ర్యాట‌క హంగులు

తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి కృషి
– సీఎం కేసీఆర్ స‌హాకారంతో టూరిజం స్పాట్‌లు
– రూ. 200 కోట్ల‌తో అనంత‌గిరికి ప‌ర్యాట‌క హంగులు
– తాండూరు ప‌ర్యాట‌క ప్రాంతాల‌ పురోగ‌తికి ప్ర‌ణాళిక‌లు
– టీఎస్‌టీడీసీ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌రువాతే రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగాల పురోగ‌తి చెందింద‌ని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల స‌హాకారంగా అన్ని జిల్లాలో టూరిజం స్పాట్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌(టీఎస్‌టీడీసీ) ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులోని టీఆర్ఎస్ యువ‌నాయకులు రొంప‌ల్లి సంతోష్ కుమార్ నూత‌న గృహ ప్ర‌వేశ వేడుక‌కు హాజ‌రైన ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌లోని ప‌ర్యాట‌క రంగాలు వృద్ధి చెంద‌లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌రువాత సీఎం కేసీఆర్ ప‌ర్యాట‌క రంగాల ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల‌లో టూరిజం స్పాట్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతుందన్నారు. రామ‌ప్ప దేవాల‌యం, వేయి స్థంబాల గుడి, యాదాద్రి దేవాల‌యాలను అభివృద్ధి చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ల సహ‌కారంతో వికారాబాద్ జిల్లాలోని అనంత‌రికి ప్ర‌ధాన ప‌ర్యాట‌క కేంద్రంగా మార్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దాదాపు రూ. 200 కోట్ల‌తో అనంత‌గిరికి అన్ని విధాల ప‌ర్యాట‌క హంగుల‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇందులో రిసార్ట్, హెల్త్ టూరిజం, అడ్వంచ‌రీ క్రీడ‌లు, న‌దీ ప్రాంతాల్లో బోట్‌ల ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్లు వివ‌రించారు. దీంతో పాటు తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని జుంటుప‌ల్లి ప్రాజెక్టు, అంతారం ఫారెస్టు ప‌రిధిలోని అర్బ‌న్ పార్కుల‌తో పాటు ప‌ర్యాట‌క ప్రాంతాల పురోగ‌తికి ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలో స‌మీక్షించి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, దేవాల‌యాలు, టూరింజ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయ‌డంతో మ‌ళ్లీ ఆయ‌న మ‌రో ప‌దేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని ప్ర‌జ‌లు అభిలాషిస్తున్నార‌ని పేర్కొన్నారు.