పైలెట్ స్పెషల్ ఫోకస్..!
– తాండూరు కోసం రోహిత్ రెడ్డి ప్రగతి మంత్రం
– రూ. 400 కోట్లతో ప్రణాళికలు సిద్దం
– సీఎం కేసీఆర్‌కు స్వయంగా నివేధికలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశ రాజకీయాలలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేల ఎర కొనుగోలు కుట్ర బద్దలు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ నుంచి అత్యున్నత స్థాయి పదవిని ఆశిస్తారని అనుకుంటున్న నేపథ్యంలో వాటిని పక్కకు తోసి తాండూరు నియోజకవర్గ ప్రగతికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్యే ఎర సంఘటన నుంచి ప్రగతి భవన్‌లోనే ఉంటున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ప్రగతి కోసం ప్రణాళికలు సిద్దం చేశారు. ఏకంగా రూ. 400ల కోట్లతో అభివృద్ధి పనులకు ఈ ప్రణాళికలను సిద్దం చేసి సీఎం కేసీఆర్‌కు స్వయంగా అందజేశారు. ఇందులో ముఖ్యంగా పెద్దేముల్ మండలం కోట్‌పల్లి నీటి పారుదల ప్రాజెక్టు ఆధునికీకరణ కు రూ.106 కోట్లు, దేవాలయాల అభివృద్ధికి రూ. 4కోట్లు, జుంటుపల్లి ప్రాజెక్టు, శివసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణతో పాటు తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ రోడ్లకు సంబంధించి 44 పనులకు గాను రూ.63కోట్ల 70లక్షలు, గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన, రోడ్లు, మురుగు కాల్వలు, భవనాల నిర్మాణం కోసం రూ.50లక్షల చొప్పున, తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను వార్డుకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు చేశారు. తాండూరులో పాలిషింగ్ యూనిట్లు, పరిశ్రమలు అధికంగా ఉన్నందున అదనంగా మరో 220 కేవీ సబ్ స్టేషన్‌తోపాటు అండర్ కేబుల్ వంటి పనుల కోసం రూ.5కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. తాండూరులో రూ.8కోట్లతో ఐటీఐ ఏర్పాటుతోపాటు పాలిటెక్నిక్ కళాశాల, ఈఎ్‌సఐ డిస్పెన్సరీ ఆసుపత్రి కోసం నిధులు కేటాయించాలని కోరారు. జినుగుర్తి, మారేపల్లి వద్ద కేజీబీవీ కోసం రూ.2కోట్లు, మూడు మోడల్ స్కూళ్లలో హాస్టల్ భవనాల కోసం, తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాలశాలలో మొదటి ఫ్లోర్ కోసం, తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కోసం రూ.5కోట్లు కేటాయించాలని కోరారు. బీసీ భవన నిర్మాణాల కోసం భూ సేకరణతోపాటు శాశ్వత భవన నిర్మాణం కోసం రూ.2కోట్లు కేటాయించాలని, బంజార భవన్ కోసం రూ.కోటితో పాటు తదితర పనులకు నిధుల ఇవ్వాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. మరోవైపు మంజూరు చేసిన పనులను ప్రారంభించేందుకు వచ్చే ఫిబ్రవరిలో తాండూరు సభకు రావాలని సీఎం కేసీఆర్‌ను కోరగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

