జాలి మంత్రం వేసిన కేటుగాటు
– నోట్లు లెక్కిస్తుండగా టోకరా
– రూ. 7500ల దోచుకుని పరార్
– తాండూరు ఎస్బీఐ బ్యాంకులో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అవసరం కోసం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిన వ్యక్తిపై ఓ కేటుగాడు జాలి మంత్రం వేశాడు. అధికారులు జాలి నోట్లు ఇచ్చారు.. లెక్కించుకుని మార్చుకో అంటూ మాయమాటలు కలిపి పక్కనే ఉండి అతని వద్ద నుంచి రూ. 7500లు దోచుకెళ్లిపోయాడు. బాధితుడు తేరుకునేలోపే బయట ఉన్న మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన గిరిబాబు అనే వ్యక్తి షావుకార్ పేట్ లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాండూరు మేయిన్ బ్రాంచ్ నుంచి సోమవారం మధ్యాహ్నం సుమారు రూ. 22 వేలు డ్రా చేశాడు. అక్కడే బ్యాంకులో తచ్చాడుతున్న గుర్తుతెలియని వ్యక్తి గిరిబాబు వద్దకు వెళ్లి బ్యాంకు అధికారులు జాలి నోట్లు ఇచ్చారని అనుమానం ఉందని, లెక్కించుకోవాలని మాయమాటలు కలిపాడు. నమ్మిన గిరిబాబు డబ్బులు లెక్కించుకోబోతుండగా వెంటనే గుర్తుతెలియని వ్యక్తి రూ. 7500ల దోచుకుని అక్కడి నుంచి పరారు అయ్యాడు. అప్పటికే బైకుతో రెడిగా ఉన్న మరోవ్యక్తితో కలిసి ఉడాయించాడు. అప్రమత్తమై గిరిబాబు కేకలు వేసిన ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడుతో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. నిందితుడు బైకుపై ముర్షద్ దర్గా వైపు పరారైనట్లు బాధితుడు చెప్పడంతో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

