తల్లి ముందే అన్నను చంపిన తమ్ముడు

క్రైం తాండూరు వికారాబాద్

తల్లి ముందే అన్నను చంపిన తమ్ముడు
– రోకలిబండదో దాడి చేసి దారుణ హత్య
– కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణం
– పెద్దేముల్ మండలం పాషాపూర్‌లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: అప్పటి వరకు కుటుంబ సభ్యులంతా ఆనందంగా విందు చేసుకున్నారు. విందులో కుటుంబ తగాదాలు తెరపైకి రావడంతో తల్లి ముందే అన్నను తమ్ముడు రోకలిబండతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని పాషాపూర్‌ తాండాలో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథకం మేరకు గ్రామానికి చెందిన దేవీబాయికి ఇద్దరు భర్తలు. మొదటి భర్త శంకర్ చనిపోయిన తరువాత, రెండో భర్త కిషన్‌ను చేసుకున్నారు. వారిద్దరు మృతి చెందారు. మొదటి భర్త శంకర్‌కు సురేష్(30), నగీనా ఇద్దరు సంతానం. రెండో భర్త కిషన్‌కు కుమార్, పపిత మరో ఇద్దరు సంతానం. తాత హీర్యా నాయక్, తల్లి దేవీబాయితో పాటు అందరు పత్తి కూలీ పనులకు వెళుతున్నారు.
సురేష్‌ మాత్రం చెరుకు కోతకు వెళుతూ వచ్చిన డబ్బులతో స్నేహితులతో మద్యం సేవించడం.. చేస్తూ.. ఇంటికి వచ్చి భార్యపై అకారణంగా దాడికి పాల్పడే వాడు. అయితే ఆదివారం కుటుంబ సభ్యులంతా ఇంట్లో విందు చేసుకున్నారు. ఈ విందులో సురేష్‌ మద్యం సేవించాడు. విందులో మద్యలో కుటుంబ సభ్యులు సురేష్‌ను తమ వెంట పత్తి కూలీకి రావాలని, స్నేహితులతో తిరగడం మానుకోవాలని సూచించారు. సురేష్‌, కుటుంబ సభ్యుల మద్య మాటామాట పెరిగింది. సురేష్‌ పద్దతితో కుటుంబ సభ్యులంతా విసిగి వేసారి పోయారు. కుటుంబ సభ్యుల తగాదాలో సురేష్‌ తమ్ముడు కుమార్‌పై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో తల్లి దేవీబాయి, తాత హీర్యానాయక్‌లు సురేష్‌ను పట్టుకోవడంతో తమ్ముడు కుమార్ పక్కనే ఉన్న రోకలి బండతో మెడపై, వీపుపై, చాతిపై దాడి చేశాడు. దీంతో సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పెద్దేముల్ పోలీసులు వెల్లడించారు.