శుభాలు కలిగించు సుబ్రహ్మణ్యేశ్వరా..!
– మణికంఠున్ని పూజించిన అయ్యప్ప స్వాములు
– సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి: శుభాలు కలిగించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ అయ్యప్ప స్వాములు మణికంఠున్ని వేడుకున్నారు. మంగళవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో వెలసిన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకుని అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఆలయం ముందు వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సమయంలో అయ్యప్ప స్వాముల భజన కీర్తనలు, నామస్మరరణ మార్మోగింది. భక్తిశ్రద్దలతో స్వాములు చేసిన పాలాభిషేకంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తడిసి ముద్దయ్యాడు. అనంతరం స్వాములు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరి కోరికలు తీర్చాలని, అందరికి శుభాలు కలిగించాలని వేడుకున్నట్లు తెలిపారు. మరోవైపు అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు ఆలయానికి తరలివచ్చి సుబ్రహ్మణ్యశ్వేర స్వామికి పాలాభిషేకం చేశారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆలయంలో కళ్యాణోత్సవం, పడిపూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు తరలిరావాలని ఆలయ కమిటి సభ్యులు విజ్ఞప్తి చేశారు.

