ఇసుక మాఫీయా దౌర్జన్యం

క్రైం తాండూరు తెలంగాణ వికారాబాద్

ఇసుక మాఫీయా దౌర్జన్యం
– కానిస్టేబుల్‌ మీదకు ఇసుక ట్రాక్టర్‌
– రెండు కాళ్లకు తీవ్రగాయాలు
– ఢీ కొట్టిన కొద్దిసేపటికే ట్రాక్టర్ బొల్తా
– సరిహద్దులో కలకలం రేపిన ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు పోలీసు కానిస్టేబుల్‌ పైకి ఇసుక ట్రాక్టర్‌ను ఎక్కించి దౌర్జన్యాన్ని ప్రదర్శించింది. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కొద్ది సేపటికే ట్రాక్టర్ బొల్తా పడింది. జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి బషీరాబాద్‌ మండల పోలీస్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు బి.శంకర్, శివరాంలు మండలంలోని ఇందర్‌ చెడ్‌ గ్రామంలో బ్లూకోట్ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా, గుల్బర్గా జిల్లా హబ్లంకు చెందిన డ్రైవర్ భీమరాయ కేఏ 32 టీబీ 5597 అనే ట్రాక్టర్‌లో ఇందర్‌ చెడ్ నుంచి తీసుకెళుతుండగా అంబేద్కర్ చౌరస్తా వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శంకర్, శివరాంలు అడ్డుకున్నారు. ట్రాక్టర్‌లో ఇసుక తరలింపుపై ప్రశ్నించారు. ఇందుకు డ్రైవర్ ఎక్కడి నుంచి తెస్తే మీకు ఎందుకు, అడ్డు వస్తే ట్రాక్టర్‌తో గుద్ది సంపుతానని బెధిరింపులకు పాల్పడ్డాడు. ఈక్రమంలో ట్రాక్టర్‌ను మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంతలో శివరాం తప్పించుకోగా శంకర్‌ ను ఢీకొట్టాడు. దీంతో శంకర్‌ కాళ్లపై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. శంకర్‌ రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ ట్రాక్టర్‌ను వేగంగా తీసుకెళ్లాడు. గ్రామ శివారులోకి వెళ్లగానే ఓ పొలంలో ట్రాక్టర్ అదుపు తప్పి బొల్తా కొట్టింది. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బషీరాబాద్‌ ఎస్ఐ విద్యాచరణ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు మంగళవారం సాయంత్రం తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ బషీరాబాద్ మండలానికి చేరుకుని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.