మృతుని కుటుంబానికి మనోహరన్న చేయూత..!
– కుటుంబానికి ఆర్థిక సాయంతో భరోసా
– ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామి
– ఎమ్మెల్యే ఆర్థిక సాయాన్ని అందించిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం కోకట్ కాగ్నా వాగులో గల్లంతై మృతి చెందిన బాధిత కుటుంబానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేయూతను అందించారు.

కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా అందించారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన మోయిజ్(28), సంగారెడ్డి జిల్లా బస్తాపూర్ ప్రాంతానికి చెందిన అతని బందువు రహమత్ అనే వ్యక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 3న బుధవారం యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నానదికి వద్దకు విహార యాత్రకు వెళ్లారు.

నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన మోయిజ్, రహమత్లు నీట మునిగి మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం తాండూరుకు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాత తాండూరుకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25వేలు అందిస్తానని తెలిపారు. దీంతో పాటు ఇంటిని ఆధునీకరణ చేసుకునేందుకు సహాకారం అందిస్తామని తెలిపారు.

అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చారు. సాయంత్రం ఎమ్మెల్యే ఇచ్చిన హామి మేరకు ఆయన అందించిన నగదు సాయాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, అఫ్పూ(నయూం), ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు దివిటి ఎల్లప్ప, రాము, బాలకృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.


