పైలెట్‌వే బ్లాక్ మెయిల్ పాలిటిక్స్..!
– రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి రోహిత్ రెడ్డికి లేదు
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన వాఖ్యలను ప్రభాకర్ గౌడ్ ఓ ప్రకటనలో ఖండించారు. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ ఆదరించిందని అన్నారు. రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్టు, ఆయన తల్లికి జెడ్పీటీసీ టిక్కెట్టు ఇచ్చి గెలిపిస్తే పార్టీని మోసం చేసిన ఘన చరిత్ర వాళ్లకి దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఎంతకు అమ్ముడు పోయారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ సర్పన్ పల్లి ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. వ్యాపారంతో పైసలు వసూలు చేస్తున్నారని జిల్లా అంతా కోడై కూస్తుందని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేసే రోహిత్ రెడ్డికి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని అన్నారు. తాండూరులో రోహిత్ రెడ్డిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

