బాలలు రేపటి పౌరులుగా ఎదగాలి
– తాండూరు మండలంలో ఘనంగా బాలల దినోత్సవం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: నేటి బాలలే రేపటి మంచి పౌరులుగా ఎదగాలని తాండూరు మండలం కరణ్ కోట్ ఎస్ఐ ఏడుకొండలు, ఐనెల్లి గ్రామ సర్పంచ్ స్వప్న జ్యోతి చంద్రశేఖర్ రెడ్డిలు అన్నారు. ఆదివారం చైల్డ్ లైన్ 1098 తాండూరు శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జినుగుర్తి కేజీబీవీ పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకుని చైల్డ్ లైన్ దోస్తీ వారోత్సవాలను నిర్వహించారు. దోస్తీ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు కోవిడ్ ప్రభావం, సమస్యలు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన వారోత్సవాలకు ఎస్ఐ ఏడుకొండలు, సర్పంచ్ స్వప్న జ్యోతిలు హాజరై మాట్లాడారు. బాల బాలికలందరు కష్టపడి చదివి తల్లిదండ్రుల
ఆశయాలను నెరవేర్చాలన్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించే సత్తాను సంపాదించుకోవాలన్నారు. సర్పంచ్ స్వప్న జ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత చదువులు, భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ 1098 తాండూరు కోఆర్డీనేటర్ వై. వెంకటేష్, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు, చైల్డ్‌లైన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

