వినాయక మండపాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయకులను ప్రతిష్టించే మండపాల నిర్వహకులు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల వినాయక చవితికి దూరమైన భక్తులు ఈసారి పెద్ద ఎత్తున జరుపుకునేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలో సీఐ రాజేందర్‌రెడ్డి ఈ ప్రకటనను విడుదల చేశారు. తాండూరు పట్టణంలో వినాయకుల విగ్రహాలను ప్రతిష్టించే మండపాల నిర్వహకులు పోలీసుశాఖ రూపొందించిన ఆన్‌లైన్ అనుమతులు పొందాలన్నారు. నిర్వహకులు, యువకులు, సంఘాలు ఆన్‌లైన్‌లోనే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం policeportal.tspolice.gov.in లింకును క్లిక్ చేసి.. ఇందులో దరఖాస్తు దారుని పేరు, చిరునామ, ఏ ప్రాంతంలో వినాయకుని ప్రతిష్టిస్తున్నారు.. ఏ ప్రాంతంలోకి వస్తుందనే వివరాలను తప్పక నమోదుచేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా మండపాల వద్ద నిర్వహకులు కరోనా నిబంధనలు పాటించి చవితి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.

