అంధత్వ నియంత్రణే సర్కారు ధ్యేయం
– కంటి వెలుగు పేదలకు వరం
– ఉచితంగా కంటి అద్దాలు, అపరేషన్లు
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో కంటి వెలుగు 2.0 ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: అంధత్వ నియంత్రణే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కంటి వెలుగు 2.0కు శ్రీకారం చుట్టిందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2.0 కార్యక్రమాన్ని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ప్రారంభించారు. పట్టణంలోని 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధ పడేవారికి వెలుగు ప్రసాధించేలా కంటి వెలుగు 2.0ను యజ్ఞంలా చేపట్టిందన్నారు. అంధత్వ నియంత్రణే ధ్యేయంగా ఇంటిల్లి పాధికి ఉచితంగా పరీక్షలను నిర్వహిస్తోందన్నారు. ఉచితంగా మందులు, కంటి అద్దాలతో పాటు ఆపరేషన్లు కూడ చేయిస్తుందన్నారు. పేదలకు వరంగా మారిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు కంటి వెలుగుపై విస్తృత ప్రచారం నిర్వహించి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మమత, వైద్యాధికారి డా. సౌమ్యరాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

