దేశానికి ఆదర్శం కంటి వెలుగు
– సర్కారు పథకానికి ఇతర రాష్ట్ర మంత్రుల ప్రశంసలు
– ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
– కంటి వెలుగును అందరు సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2.0 దేశానికి ఆదర్శంగా నిలిచిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు పరీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టిసారించారని అన్నారు. అందుకోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాల మంత్రులు ప్రశంసిస్తున్నారని గుర్తుచేశారు. పరీక్షల అనంతరం ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందిస్తారని, అవసరమైన వారికి రూ. 40 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు భరించి అపరేషన్లు కూడ చేయిస్తారని తెలిపారు. 100 రోజులు పాటు నిర్వహించే ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంధత్వ రహిత తాండూరు ఏర్పాటుకు అందరు తోడ్పాటు అందించి.. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్, తాండూర్ ఆర్డీవో అశోక్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ వినయ్ కుమార్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, విజయాదేవి, సంగీత ఠాకూర్, బొంబీనా, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, బీఆర్ఎప్ పట్టణ ఉపాధ్యక్షులు హరి హరగౌడ్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, నాయకులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

