శివ స్వాముల ఆగ్రహం..!
– మాల దారణను అవమానించారని ఆందోళన
– నిందితునిపై దాడి చేసిన శివస్వాములు
– యాలాల పోలీస్టేషన్‌లో పరస్పరం కేసుల నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: శివ మాల దారణను అవమానించడంపై శివస్వాలు ఆగ్రహించారు. మాలను అవమానించినపై వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. అనంతరం నిందితునిపై స్వాములు దాడికి దిగడంతో పరస్పరం పోలీసులకు పిర్యాదులు అందాయి. ఈ మేరకు పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం

దేవనూర్ గ్రామంలో సోమవారం రాత్రి గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్‌ను మైక్ విషయంలో దాడి చేశారు. దీనిని గమనించిన శివ మాల ధరించిన స్వామి నరేందర్ అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నరేందర్‌కు అదే గ్రామానికి చెందిన మెట్ల నరేష్‌తో వాగ్వివాదం జరిగింది. దీంతో నరేష్ నరేందర్‌ను, శివ మాలను అవమానించే విధంగా వాఖ్యలు చేశారు. దీనిపై నరేందర్ మంగళవారం ఉదయం యాలాల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా రోడ్డులో దాదాపు 100 మంది శివస్వాములు ఆందోళనకు దిగారు. శివ మాలను అవమాన పరిచిన నిందితుడును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో నిందితుడు నరేష్ యాలాల వెళ్లినట్లు తెలుసుకుని స్వాములు అక్కడికి చేరుకున్నారు. అక్కడ నరేష్‌పై శివ స్వాములు మూకుమ్ముడిగా దాడి చేశారు. అనంతరం తనపై దాడి చేసిన వారిపై నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శివ మాలను అవమానించే విధంగా వాఖ్యలు చేసినందుకు నరేష్‌ను అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు నరేష్‌పై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సంఘటన తాండూరులో కలకలం రేపింది. పోలీసులు విడుదల చేసిన ప్రకటన కింద ఉంది.


