తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
– ప్రతి వార్డులో బోరు మోటార్లు ఏర్పాటు
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. గురువారం పట్టణంలోని 20వ వార్డుతో పాటు 12వ వార్డులలో వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి బోరు మోటార్ల పనులు ప్రారభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో

పట్టణంలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులో బోరు మోటార్లు వేయిస్తున్నామన్నారు. ఇప్పటికే 1, 4, 5, 13, 23వ వార్డులలో బోరు మోటార్లు వేయించడం జరిగిందని తెలిపారు. మరోవైపు ప్రతి వార్డులో రూ. 1 కోటి రూపాయిలతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పూజ రజనీకాంత్, సంగీత ఠాకూర్, బీఆర్ఎస్ పట్టు ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, బీజేపీ నాయకులు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

