పోడు.. ముందడుగు..!
– అర్హులకు భూ పట్టాల పంపిణీకి కసరత్తు
– జిల్లాలో 426 మంది రైతుల గుర్తింపు
– ప్రత్యేక చొరవ చూపిస్తున్న జిల్లా కలెక్టర్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలోనే పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్‌వోఎఫ్‌వో చట్టం ప్రకారం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. వాటి ప్రకారం వికారాబాద్ జిల్లాలోని అధికారులు పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఇందుకోసం నూతనంగా బాధ్యతలు చేపట్టిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు నివేదికలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లాలోని 111 గ్రామ పంచాయతీలు 128 హ్యాబిటేషన్లల్లో ఉన్న 21,761 ఎకరాల్లోని పోడు భూ ములను గిరిజనులు 10,635 ఎకరాలను .. ఇతరులు 11,126 ఎకరాలను సాగు చేసుకుంటున్నారు. కాగా ఇప్పటివరకు 9,647 మంది రైతులు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 2005 డిసెంబర్ 13 కంటే ముందు పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం వారికి పట్టాలు అందించాలని నిర్ణయించింది. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులలో 426 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులకు త్వరలోనే పట్టాలు అందించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకోసం పకడ్బందీగా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. 2005 సంవత్సరం కంటే ముందు నుండి పోడు భూముల్లో సాగు చేస్తున్నట్టుగా వచ్చే అర్జీలకు గ్రామ పెద్దల అవిడేవిట్, రేషన్ కార్డు వివరాలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోడు భూముల ప్రక్రియను ఈనెల 13 నుండి 17 వరకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులు త్వరలోనే తమ భూములకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

